భారతదేశం లో ఆశ్రమ ధర్మాలు మరియు నాగరికత

భారతదేశ నాగరికత గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషి పుట్టిన దగ్గరినుంచి ఎలా జీవనం సాగించాలి, ఎలాంటి విధులు నిర్వహించాలి అనే అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ విధానంలో గొప్ప సామాజిక శాస్త్రం మనకు కనపడుతుంది.

వేదశాస్త్రం ప్రకారం మనిషి తన జీవితంలో నాలుగు ఆశ్రమ ధర్మాలను పాటించాలి అని చెప్తుంది. అవి 1) బ్రహ్మచర్యం 2) గృహస్తాశ్రమం 3)వానప్రస్తాశ్రమం 4)సన్యాసాశ్రమం వాటిగురించి వివరంగా చూద్దాం.

1)బ్రహ్మచర్యం: బ్రహ్మచర్యం అనగానే పెళ్లి చేసుకోకుండా ఉండటం అని అనుకుంటాం కాని బ్రహ్మచర్యం అంటే బ్రహ్మని అనుసరించడం, అనగా వేదానుసారం బ్రహ్మని గురించి తెలుసుకోవడం. బ్రహ్మచర్యం తో విద్యాభ్యాసం చేసి బ్రహ్మ జ్ఞానాన్ని పొందమని అర్ధం. విధ్యనభ్యసించేవారు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించి తీరాలి. బ్రహ్మచర్యం కేవలం పురుషులు ఆచరించేది కాదు, ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ ఆచరించాలి అని శాస్త్రం చెప్తుంది.

బ్రహ్మచర్యంలో ఉన్నపుడు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

a) సుర్యోదయమునకు పూర్వమే మేల్కొనవలెను. ప్రాతఃకాలంలో విధ్యాబ్యాసం చేయవలెను. ప్రాతఃకాలంలో మానవుని యొక్క మెదడు చురుకుగా పని చేస్తుంది.

b) జూదము, ఇతరులతో కలహించుట, నిందించుట, అబద్దములాడుట వంటివి చెయ్యరాదు.

c) స్త్రీ తో సంభోగించుట, స్త్రీ తో సల్లాపము చేయుట వంటివి చేయరాదు.

d) సాత్వికాహారము భుజించవలెను. తేనెను, మంసాహరమును విడువవలెను. తీపి మరియు పులిసిన పదార్ధములను భుజించారాదు.

e) ఎప్పుడు ఒంటరిగానే నిద్రించవలెను.

లక్ష్యం: బాల్యము నందు, కేవలం జ్ఞానాపేక్ష తో పురుషార్దములైన ధర్మార్ధ కామ మోక్షములలో ఒకటైన ధర్మాచరణచే జీవించవలెను.

2)గృహస్తాశ్రమం: బ్రహ్మచర్యం పాటించి విధ్యాబ్యాసం పూర్తిచేసిన వారు, సశాస్త్రీయము గా కన్యని పరిణయమాడి గృహస్తాశ్రమం లోకి ప్రవేశిస్తారు. ఇది యుక్త వయసులో జరుగుతుంది. (బాల్యము నందు వివాహము లేదని అర్ధం అవుతుంది). సమాజంలో ఇది ఎంతో భాద్యతతో కూడినది. గృహస్తాశ్రమం మీద ఆధారపడి మిగిలిన ఆశ్రమాలు ఉంటాయి.

గృహస్తాశ్రమంలో ఉన్నపుడు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

a) స్వార్ద చింతనలేక, కేవలం తన కుటుంబం గురించి మాత్రమే కాకుండా, బంధువులను, స్నేహితులను, అతిధులను, దీనులను ఆదరించవలెను.

b) సత్కర్యములను ఆచరించుటచే అర్ధమును(ధనము) సంపాదించవలెను.

c) కేవలం కామ వాంఛ కాక, సత్ సంతానాపేక్షతో ఉండవలెను.

d) యజ్ఞములు, దానములు చేయవలెను. పశు పక్ష్యాదులను ఆధరించవలెను.

లక్ష్యం: యవ్వనము నందు, కేవలం వంశ వృద్ది, సమాజ హితము, న్యాయార్జితము ప్రధానంగా, పురుషార్దములైన ధర్మార్ధ కామ మోక్షములలో అర్ధ, కామములను ఆచరించవలెను.

3)వానప్రస్తాశ్రమం: గృహస్తాశ్రమమందు న్యాయర్జనతో, వంశాభివృద్ది చేసిన తరువాత మొక్షాపేక్షతో వానప్రస్తాశ్రమం స్వీకరిస్తారు. ఇది ప్రౌఢ వయసులో స్వీకరిస్తారు. వానప్రస్తాశ్రమం స్వీకరించిన వారు ఇహసుఖములను త్యజించ వలెను. పరిజనములను వీడి వంటరిగా గృహమునుండి దూరముగా జీవించవలెను. భార్యను పుత్రులకు ఆధీనము చేసి కాని,లేదా తన అనుమతితో వెళ్ళవలెను. భార్య తన వెంట వస్తాననిన సతీ సమేతముగా వెళ్ళవలెను.

వానప్రస్తాశ్రమంలో ఉన్నపుడు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

a) అలంకరణకు ప్రాధ్యాన్యత లేక ఇహ సుఖములను వీడి ఉండవలెను.

b) రుచులను వీడి కేవలం జీవనం కొరకు మాత్రమే భుజించవలెను. సత్వ రజోగుణ ప్రధాన ఆహారమును త్యజించవలెను.

c) స్త్రీ వ్యామోహము, సంగమము విడువవలెను.

d) రాగ ద్వేశాములను మాని ఎల్లప్పుడూ సమాజ హితము కోరవలెను.

e) మోక్ష సాధనకై ప్రయత్నం చేయవలెను.

లక్ష్యం: ప్రౌఢము నందు, కేవలం సమాజ హితము, మొక్షాపేక్ష కలిగి జీవనం సాగించుట.

4)సన్యాసాశ్రమం: సన్యాసాశ్రమంలో వంటరిగా జీవించవలెను. మూడు ఆశ్రమ ధర్మములను పాటించక సన్యాసాశ్రమం స్వీకరించరాదు.

సన్యాసాశ్రమంలో ఉన్నపుడు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

a) ఒంటరి జీవితం గడపవలెను. ఒంటరికి మాత్రమే మోక్షము సిద్ధించునని తెలుసుకొనవలెను.

లక్ష్యం: మొక్షాపేక్ష కలిగి తపో జీవనం సాగించుట.

మీకు పైన వివరించిన విషయాలు ఈ కాలానికి తగ్గట్టుగా, అందరికీ ఉపయోగపడేవి మాత్రమే చెప్పడం జరిగింది. పాటించవలసిన నియమాలు ఇంకా చాల ఉన్న ఇప్పుడున్న కాల పరిస్థితులకు అవి అన్వయం కాకపోవచ్చు అందుకే వాటిని తెలుపలేదు. (ఉ.దా మునులకు సత్కారం వంటివి).

ఈ తరం లో మనం ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలను సరిగా పాటించకపోవడం వలన, విద్యార్ధులకి విలువలతో కూడిన విద్య లభించడంలేదు, గృహస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, గృహస్తు సంసారంలో కూడా ఎన్నో అపశ్రుతులు దొర్లుతున్నాయి. ఏ బంధము కూడా సరిగా నిలబడలేని పరిస్తితికి వచ్చింది.

ఏ వయసులో ఏమి చెయ్యాలో ఎంతో అనుభవ పూర్వకంగా చెప్పారు, కాని మనం అవి పాటించక, పదవి కోసం, హోదా కోసం, ధనం కోసం ఎన్నో చేస్తూ, ఇంట బయట అశాంతిని పొందుతున్నాము.

Post Comments
Loading Facebook Comments ...